యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కవిత.. బీజేపీపై ఎటాక్ చేసేందుకేనా?

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కవిత.. బీజేపీపై ఎటాక్ చేసేందుకేనా?


Powered By PLAYSTREAM
కొన్నాళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న మాజీ ఎంపీ కవిత.. మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారా? బొగ్గు గనుల ప్రయివేటీకరణపై వ్యతిరేక పోరుతో బీజేపీపై ఎటాక్ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారా? నాయకత్వ వైఫల్యంతో బలహీనపడ్డ టీఆర్ఎస్ అనుబంధ సంఘానికి కవిత ఏ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారు? గతంలో వదిలేసిన సింగరేణి కార్మిక సంఘం బాధ్యతలను ఆమె తిరిగి స్వీకరించడంలో పరమార్థమేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.


    తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ కవిత తిరిగి క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో కాస్త సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గతంలో తను నాయకత్వం వహించిన టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం బాధ్యతలను కవిత మళ్లీ స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  బొగ్గు బ్లాక్ ల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమం ద్వారా కవిత రీఎంట్రీ ఇస్తున్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగరేణివ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఒకరోజు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.  తద్వారా  కేంద్ర ప్రభుత్వం.. మరీ ముఖ్యంగా తనను ఓడించిన బీజేపీపై ముప్పేట దాడి చేసేందుకు కవిత కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కవిత రీఎంట్రీపై టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం క్యాడర్ లో జోష్ మొదలైంది.


    వాస్తవానికి కవిత గతేడాది జనవరి వరకు  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఓ విధంగా చెప్పాలంటే యూనియన్ ను పూర్తిగా ఆమె నడిపించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక కార్మిక సమస్యలను పరిష్కరించారు. అదే సమయంలో, యూనియన్ నేతల వర్గపోరు, అవినీతి అక్రమాలతో బలహీనపడిన టీబీజీకేఎస్ కు జీవం పోశారు. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఓటమి ఖాయం అనుకున్న టీబీజీకేఎస్ ను గెలుపు తీరానికి చేర్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అనుబంధ కార్మిక సంఘాల బాధ్యతల నుంచి తప్పుకోవాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆర్టీసీ తదితర కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా ఉన్న హరీష్ రావు ముందుగా తన పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎంపీ కవిత కూడా గతేడాది ఫిబ్రవరిలో టీబీజీకేఎస్ తోపాటు  ఇతర కార్మిక సంఘాల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ ఇద్దరు ముఖ్యనేతలు తప్పుకోవడంపై అప్పట్లో అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి.



    నిజానికి కవిత నిష్క్రమణతో సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బలహీనపడుతూ వచ్చింది. అందులో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. అంతర్గత సమావేశాల్లో కొట్టుకోవడాలు, నాయకుల రాజీనామాలు నిత్యకృత్యం అయ్యాయి. వారిని నియంత్రించేవారు కరువయ్యారు. యూనియన్ నేతల చిల్లర పంచాయతీ అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకదశలో యూనియన్ అవసరమా అన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. మరోవైపు సింగరేణిలోని సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వారికి కార్మికుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బొగ్గు గనుల ప్రయివేటీకరణకు నిరసనగా  జాతీయ కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈనెల 18న సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. జులై 2 నుంచి మూడురోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.  ఈ విషయంలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ వెనుకబడింది. పైగా సింగరేణి గుర్తింపు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణిలో యూనియన్ దెబ్బ తింటే.. అది భవిష్యత్తులో టీఆర్ఎస్ కు కూడా రాజకీయంగా నష్టం చేకూరుస్తుందన్న అంచనాకు పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కవిత రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.



    కవిత రీఎంట్రీపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంపీగా అనూహ్య ఓటమి షాక్ నుంచి తేరుకున్న తర్వాత కవిత తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతుండటం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆమె అనుచరులు, అభిమానుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలోనే అధిష్టానం నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెకు అవకాశం ఇచ్చింది. కరోనా ప్రభావంతో ఆ ఎన్నిక వాయిదా పడుతున్నా... అక్కడ ఎమ్మెల్సీగా కవిత గెలవడం లాంఛనప్రాయమే. అంతకంటే ముందుగానే సింగరేణి యూనియన్ లో క్రియాశీలక పాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో బలపడాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీపై ఎదురుదాడికి బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు కవిత కార్యాచరణను సిద్ధం చేసినట్టు  చెబుతున్నారు.


   మొత్తానికి కవిత రాకపై టీబీజీకేఎస్ లోని కిందిస్థాయి క్యాడర్ తెగ సంబుర పడుతోంది. యూనియన్ కు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. అదే సమయంలో కోల్ బెల్ట్ లోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.  మరి కవిత రీఎంట్రీ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. కొద్ది రోజులు వేచిచూడాలి.

Comments