సంక్షోభంలో వైద్య రంగం

సంక్షోభంలో వైద్య రంగం
పలు సవాళ్లు ఎదుర్కొంటున్న ఆస్పత్రులు
విధి నిర్వహణకు వైద్య సిబ్బంది నిరాసక్తత..!

మృతశిశువును కడుపులో మోస్తూ ఆయాసపడుతున్న ఓ గర్భిణి.. కరోనా అనుమానం కారణంగా వైద్యం అందక 12 గంటలపాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయింది!! హన్మకొండలో జరిగిన దారుణమిది!!

‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేసిన్రు. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. డాడీ బై.. డాడీ బై, అందరికీ బై డాడీ’ ..అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న కొన్ని క్షణాలకే ప్రాణాలు కోల్పోయిన రవికుమార్‌ హృదయవిదారక స్థితి ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది!!

జ్వరం, దగ్గుతో బాధపడుతూ.. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మహిళను చికిత్స కోసం తీసుకెళ్తే.. ‘కరోనా లక్షణాలున్నాయి, చికిత్స చేయం’ అంటూ పది ఆస్పత్రులు తిప్పి పంపేశాయి! చివరికి గాంధీ ఆస్పత్రి ముందే నురగలు కక్కుతూ చనిపోయిందామె!! పదిరోజుల క్రితం జరిగిన విషాదమిది!!

(హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి)

కరోనా దెబ్బకు రాష్ట్రంలో వైద్య రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేసులు నానాటికీ శరవేగంగా పెరిగిపోతుండడంతో కార్పొరేట్‌, ప్రైవేట్‌, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఉన్న వైద్యులు, వైద్యసిబ్బంది సరిపోవట్లేదు. ఉన్నవారిలోనూ కొందరు విధులకు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో చికిత్సలు అందించడంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో రోగులను చేర్చుకునే విషయంలో ఆస్పత్రి వర్గాలు ఒకటికి పదిసార్లు వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు రోగులను గేటు బయట నుంచే పంపించేస్తున్నారు. ఫలితంగా.. సమయానికి చికిత్స అందక రోగులు నరకం అనుభవిస్తున్నారు.

నిరాసక్తత..

కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో విధులను నిర్వర్తించడానికి కొంత మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఆసక్తి చూపట్లేదని సమాచారం. అంబర్‌పేట మునిసిపల్‌ సర్కిల్‌ -16లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చాలా మంది డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని.. కొందరు వైద్యులు, నర్సులు దీర్ఘకాలిక సెలవులు పెట్టగా, మరికొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారని తెలుస్తోంది.

పెద్ద సంఖ్యలో కావాలి

ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్స్‌కు చికిత్స అందించడానికి ప్రత్యేక, అదనపు సిబ్బంది అవసరం పెరుగుతోంది. పది పడకలకు కేటాయించే సిబ్బందిని మూడు నాలుగు పడకలకే నియమించాల్సి వస్తోందని హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడు వివరించారు. ఇక ఐసీయూ, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ అవసరమైతే ఆ రోగి వద్ద ప్రత్యేకంగా ఓ నర్స్‌, అటెండర్‌ను తప్పనిసరిగా ఉంచాల్సి వస్తుంది. ఒక రోగికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి ఎనిమిది మంది వైద్య సేవలు అందించాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.

నర్సుల కొరత తీవ్రం

కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మొదటి నుంచి నర్సుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా కారణంగా ఈ కొరత మరింత పెరిగింది.  దీంతో కొన్ని ఆస్పత్రుల వారు నర్సుల కోసం ఏజెన్సీలను సంప్రందిస్తున్నట్లు సమాచారం. నర్సింగ్‌ స్కూల్స్‌ ఉన్న ఆస్పత్రులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇతర ఆస్పత్రులకు నర్సుల కొరత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఎక్కువ వేతనం ఇవ్వడానికైనా ఆస్పత్రి వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా ఫార్మసిస్టులు, ఫిజియెథెరపిస్టుల కొరత పెరిగిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

కేరళ నుంచి చార్టర్డ్‌ ఫ్లైట్‌లో నర్సులు

కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో.. హైదరాబాద్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులు నర్సుల కొరతను ఎదుర్కోవడానికి 50 మంది నర్సులను తిరువనంతపురంనుంచి చార్టర్డ్‌ విమానాల్లో రప్పించాయి. మరికొన్ని ఆస్పత్రులైతే నర్సులకు మూడు రెట్ల అధిక వేతనాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయినా నర్సులు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న నర్సుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. మిగతావారంతా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్తున్నారు. దీంతో నర్సుల కొరత నానాటికీ పెరుగుతోందని కార్పొరేట్‌ ఆస్పత్రి ప్రతినిధి ఒకరు తెలిపారు.

క్లినిక్‌లకు కష్టకాలం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిదిలో ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకూ క్లినిక్‌లుంటాయి. వాటిలో అధికభాగం క్లినిక్‌లు లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ తెరచుకోవట్లేదు. లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని క్లినిక్‌లు తెరిచి వైద్యం అందించినప్పటికీ.. కొంత కాలానికే మూతపడ్డాయి. మరికొన్ని క్లినిక్‌లు తెరుచుకున్నా.. అతికొద్దిమంది పేషెంట్లను మాత్రమే అనుమతిస్తున్నాయి. రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడం, క్లినిక్‌లు చిన్నవిగా ఉండడంతో భౌతిక దూరం పాటించడం కష్టంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు.

మందులదుకాణాలదీ అదే దారి

ఒకప్పుడు హైదరాబాద్‌లో 24 గంటలపాటు పనిచేసే మందుల దుకాణాలు ఉండేవి. లాక్‌డౌన్‌ విధించాక ఆయా దుకాణాలను రాత్రిపూట తెరిచి ఉంచట్లేదు. వైరస్‌ భయంతో చాలా మంది సిబ్బంది అసలు దుకాణానికి రావడానికే ఇష్టపడట్లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కొద్దిరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కొన్ని సంఘాలు సమావేశమై హైదరాబాద్‌ పశ్చిమ మండలం పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకే అమ్మకాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని హోల్‌సేల్‌ మందుల దుకాణాలను ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు.

చిన్న ఆస్పత్రుల్లో..

రాష్ట్రంలో దంత, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) ఆస్పత్రులు, ఫిజియోథెరపీ, సంతాన సాఫల్య కేంద్రాల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆయా సెంటర్లలో పని చేసే సిబ్బందిలో చాలామంది విధులకు హాజరు కావట్లేదు. పక్షవాతంతో బాధపడేవారికి ఫిజియోథెరపిస్టుల అవసరం చాలా ఉంటుంది. లాక్‌డౌన్‌ తరువాత కొందరు ఫిజియోథెరపిస్టులు బాధితుల ఇళ్లకు వెళ్లి సేవలు అందించారు. మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వారూ సేవలకు దూరంగా ఉంటున్నారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లలోని సాంకేతిక సిబ్బంది  విఽధులు నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదు.  పలు రకాల పరీక్షలను బాధితులకు దగ్గరగా ఉండి చేయాల్సి వస్తుండడంతో సిబ్బంది భయపడుతున్నారు.

ఇటలీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో పీజీ స్టూడెంట్లతో కొవిడ్‌ చికిత్స!

ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆ గండాన్ని దాటడమే తక్షణ కర్తవ్యం! అందుకే అమెరికా, యూరప్‌ దేశాల్లో ఈ దిశగా పలు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు. డెంటిస్టులు, కంటివైద్యుల నుంచి గైనకాలజిస్టుల దాకా అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులనూ కొవిడ్‌-19 చికిత్సల్లో భాగం చేశారు. అలాగే.. ఆఖరు సంవత్సరం వైద్యవిద్యార్థులను కూడా ఇంకా పరీక్షలు పూర్తికాకముందే విధుల్లోకి చేర్చారు. యూకేలో అయితే ఆఖరు సంవత్సరం వైద్యపరీక్షలను రద్దు చేసేశారు. ఆస్పత్రుల్లో వారు వైద్యం చేయకపోయినప్పటికీ.. వైద్యులకు సహాయంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల నర్సులపై భారం తగ్గింది. అటు ఇటలీలో వైరస్‌ పతాకస్థాయికి చేరినప్పుడు.. పదివేల మంది వైద్యవిద్యార్థులను కొవిడ్‌-19 చికిత్సలో భాగం చేశారు.

విధులకు రానంటే జైలు, జరిమానా

కరోనా భయంతో విధులకు హాజరు కాలేమనే వైద్యులపై మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు ‘ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897’ కత్తిని వేలాడదీసింది. తాము పిలిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి రెండు వారాలపాటు విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ 75వేల మంది వైద్యులకు లేఖలు రాసింది. అందుకు తిరస్కరించినవారికి జైలు, జరిమానా విధిస్తామని, లైసెన్సును కూడా కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.  మరోవైపు కరోనాయేతర పేషెంట్లకు కచ్చితంగా చికిత్స చేయాల్సిందేనని ఢిల్లీ సర్కారు ఏప్రిల్‌ 30న అక్కడి ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. అలా చేయని ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. కరోనా ముప్పు పెరుగుతున్న నేపత్యంలో ఏప్రిల్‌ 15న కేంద్ర హోం శాఖ కూడా.. కరోనాయేతర చికిత్సలపై ఇదే తరహా ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్‌లోనూ అన్ని వైద్యసేవలనూ అందుబాటులో ఉంచాలని స్పష్టంచేసింది. కానీ, దేశవ్యాప్తంగా ఇప్పుడు వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.

Comments