విద్యుత్తు బిల్లులపై అపోహలు అక్కర్లేదు

విద్యుత్తు బిల్లులపై అపోహలు అక్కర్లేదు
అనుమానాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌లు: మంత్రి
30, 40, 30 శాతాల్లో చెల్లించే వీలు
ఒక్క  యూనిట్‌ కూడా ఎక్కువ వేయలేదు


హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు బిల్లులపై అపోహలు, అనుమానాలు అక్కర్లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏ   తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఇస్తున్నామని, అనుమానాల నివృత్తికి ప్రతి ఈఆర్‌వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం)లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగం పెరిగే కొద్దీ కేటగిరి మారిందన్నారు. సాధారణ రోజుల కన్నా వేసవి వినియోగం 30-40ు దాకా ఎక్కువ ఉంటుందని, లాక్‌డౌన్‌తో 15-20ు అదనపు వినియోగ ం నమోదైందని తెలిపారు. సోమవారం ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బిల్లులను 30, 40, 30% చొప్పున వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నామని చెప్పారు. రెగ్యులర్‌ బిల్లులతో పాటు బకాయిలు కట్టాలన్నారు. అపరాధ రుసుం   చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సరాసరి బిల్లుల వల్ల కొందరికి ప్రయోజనం, మరికొందరికి నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. 3 నెలల రీడింగ్‌ను  తీసి.. మూడు భాగాలుగా భాగించామని, ఒక్క యూనిట్‌ కూడా ఎక్కువ వేయలేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన

మూడు నెలలకు రూ.21 వేల విద్యుత్తు బిల్లు రావడంతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా ఆందోళన చెందారని మంత్రి చెప్పారు. రూ.18 వేల బిల్లు వచ్చిందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌, రూ.45 వేలు వచ్చిందని ఎమ్మెల్యే సైదిరెడ్డి తన వద్దకు వస్తే.. అనుమానాలన్నీ నివృత్తి చేశానని ఆయన చెప్పారు. 

Comments